Monday, April 12, 2010

ఎదురు చూపులు

ఎందుకో ఎదురు చూపులు
వెళుతూ తిరిగిచూస్తావని!
మౌన గీతం వినిపిస్తే
మనసు కరిగి వస్తావని!

కనుల చెమ్మకు కరువేముంది
సముద్రాన నీటి బొట్లలా!!

Thursday, April 8, 2010

పాట్లు-నోట్లు

కూలి నాలి చేసుకొని, మట్టి కంపు కొట్టుకొని,
మట్టి కంపుతో ఇంటికొస్తే....!

ఇంటి ఎదురుగా సారాయి షాపాయే,
ఇంటి వెనుక లాటరీ మట్కా ల గోలాయే
కూలి సొమ్ము వాటి పాలాయె
ఇంటి ఇల్లాలికి పాట్లాయే...
మన ప్రభుత్వానికి నోట్లాయే..
 


నా ఉనికి

రవిబింబమై నువు పయనిస్తుంటే
ప్రొద్దుతిరుగుడు పువ్వునై నిన్ననుసరిస్తా
మబ్బుల చాటున నువ్వు దాక్కుంటే
అచేతనంగా నాలో నేనే ముడుచుకుపోతా...!
నీ అడుగులో అడుగేస్తుంటే
ప్రపంచం అంచులదాకా నడుస్తానన్న విశ్వాసం
నువు కనుమరుగై నే ఒంటరినయితే
నా ఉనికే నాకు తెలియని ప్రశ్నార్థకం...!

Thursday, April 1, 2010

పాసుపోర్టు : నా తిప్పలు

నా పాసుపోర్టు (Passport) కాల పరిమితి ముగిసే సమయం వచ్చిందని మా ఆఫీసువాళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు పంపించటం మొదలెట్టారు. ఇక తప్పనిసరై మంచి రోజున ఆన్ లైను లో పాసుపోర్టు గడువు పోడుగించు కోవటానికి దరఖాస్తు చేసాను (https://passport.gov.in/pms/Information.jsp ).  ఆ మంచి రోజు రానే వచ్చింది.  అన్నీ అవసరమైన పత్రాలు తీసుకొని పాసుపోర్టు ఆఫీసుకి వెళ్లాను. ( అవసర మయిన పత్రాల కోసం http://passport.gov.in/cpv/checklist.htm  ని చూడండి)


చెన్నయ్ పాసుపోర్టు ఆఫీసుకి వెళ్ళటం తోనే నా గుండె ఆగినంత పనయింది... ఆరు వరుసలలో కొన్ని వేలమంది ఉన్నారు...  చాలా మంది ఉదయాన్నే 6 గంటలకు  వచ్చారట.. మనం మాత్రం తీరికగా 10 గంటలకి వెళ్లాం. నా వాహనాన్ని ఒక చోట నిలిపి, తక్కువగా జనాలు ఉన్న వరుసలో నిలుచున్నా...  ఆ వరుస మొదటి అంతస్తు వరకూ ఉంది.  తీరా అక్కడికి వెళ్తే.. ఇది త్వరితగతిన పాసుపోర్టు ఇచ్చే (Tatkaal Passport) వరుస అని వెనక్కి పంపించారు. త్వరితగతిన పాసుపోర్టు ఇచ్చే పద్దతికి రూ.2500 మామూలు పద్దతికి రూ.1000 ఖర్చవుతుంది.  అక్కడ ఎటువంటి సమాచారమిచ్చే బోర్డులు కానీ మనుషులు కానీ కనిపించలేదు.


నా అదృష్టం బాగుంది, ఎవరో తెలుగులో మాట్లాడుతున్నారు... ( మనకి తమిళం అంతంత మాత్రం వచ్చు) వాళ్ళ దగ్గరికి వెళ్లి నా భాద చెప్పా...  వాళ్ళు ఏ వరుస ఎందుకో చెప్పారు.


  • వరుస 1: త్వరితగతిన పాసుపోర్టు ఇచ్చే (Tatkaal Passport) వరుస లేదా ముసలి వాళ్లకి, 3 సంవత్సరాలకంటే చిన్న వయసున్న పిల్లలకి సాధారణ పాసుపోర్టు ఇచ్చే వరుస
  • వరుస 2:  పాసుపోర్టు విచారణ వరుస
  • వరుస 3: పాసుపోర్టులు ఇవ్వటానికి అవసరమయిన పరిశీలనా వరుసలో కి వెళ్ళటానికి టొకనులు ఇచ్చే వరుస. యీ వరుసలో ఇచ్చే తోకను మీద ఆంగ్ల అక్షరాలయిన "Ordinary P","Ordinary Q","Ordinary R", "Tatkaal P","Tatkaal Q","Tatkaal O" లు ఉంటాయి.  అన్నీ తత్కాల్ (Tatkaal ) టొకను వాళ్ళు వరుస 1 కి వెళ్ళాలి.
  • వరుస 4:  "Ordinary P" వాళ్ళ వరుస
  • వరుస 5: "Ordinary Q" వాళ్ళ వరుస 
  • వరుస 6: "Ordinary O" వాళ్ళ వరుస
వరుస 1 నుంచి గెంటి వేయబడ్డ తరువాత, వరుస 3 లో నిలుచున్నా.. "Ordinary P" టొకను ఇచ్చారు. ఇంతలో, పాసుపోర్టు ఆఫీసర్లకి భోజన సమయం కావటం తో నేను వరుస 4 లో అలానే నుంచుడి  పోయా...  మనకి ఆ పూటకి భోజన ప్రాప్తి లేదని అర్థమయింది.


కొంత సేపటికి మరలా పాసుపోర్టు ఆఫీసర్ల భోజనాల తరువాత వరుస 4 మొదలయ్యింది. నా వంతు వచ్చింది. ఒక ముసలావిడ కూర్చొని ఉంది. నా దరకాస్తు చూసి, ఏదో ఒక ఫోటో కాపీ మీద సంతకం లేదని, విసిరికొట్టింది. మరలా  వరుస బయటకి. ... ఆ సంతకమేదో పూర్తిచేసి, మరలా అక్కడున్న కాపలాదారుని బ్రతిమలాడి, లోపలి వెళ్ళా.... ఈ సారి, నా పాసుపోర్టు హైదరాబాదు లో ఇచ్చారు కాబట్టి , రెండవ అంతస్తులో ఇంకొక ఆఫీసరు దగ్గరకి వెల్లి చూపించి స్టాంపు వేయించుకొని రమ్మంది.


తిరిగి మొదటికి..ఆ స్టాంపు వేయించుకొని వచ్చా...  ఈ సారి కాపలాదారుని బ్రతిమలాడినా ప్రయోజనం లేక వరుసలో నించున్నా...  నా వంతు వచ్చింది. ఆవిడ అన్నీ చూసి Appedix I (https://passport.gov.in/cpv/ANNEXUREI_std.htm) లేదు , కనుక త్వరగా 10 నిమిషాలో చేయించుకు రమ్మంది. బయటకి వచ్చి, కాపలాదారుని ఎలా అని అడిగితే, ఆఫీసు ఎదురుగా ఉన్న ఒక నోటరీ బోర్డు చూపించాడు. అక్కడికిది పరుగుపరుగున వెళ్ళి ఆ పనేదో కానిచ్చి వచ్చేసరికి, పాసుపోర్టు ఆఫీసర్లు తాళాలు వేసి బయటకి వస్తున్నారు.  నన్ను చూసి, ఆగి "Verified"  అనే స్టాంపు వేసి వెళ్ళి ఫీజు ( Fee) కట్టమన్నారు.  ఫీజు రెండవ అంతస్తులో కట్టాలి. అక్కడికి వెళ్ళేటప్పటికి, ఆ విభాగం మూసివేసారు.


చేసేది లేక, రెండవ రోజు, వెళ్ళి ఫీజు కట్టి, దరకాస్తు ఇచ్చి వచ్చా.


ఇవండీ నా తిప్పలు .