Friday, September 5, 2008

షాంబర్గ్ లో చివరి రోజు

ఈ రోజు షాంబర్గ్ లో నా చివరి పని రోజు. రేపు ప్రయాణం! మరలా ఎల్లుండి సొంత గూటికి. అక్కడికి వెళ్లి ఇంటర్నెట్ కోసం కుస్తీ పట్టాలి.. లేక పొతే నా బ్లాగులని స్నేహితులని కలవటం కష్టమవుతుందేమో! సుమారు రెన్దొన్నర సంవత్సరాల తరువాత వెళ్తున్నా... చూడాలి! ఎలా ఉంటుందో! రోడ్లు..ఇల్లు.. జనాలు..:-) ఈ మధ్య పేపరు వాళ్ళు అంతా అల్లకల్లోలం అన్నట్లు రాస్తున్నారు. చూడాలి అవి ఎంతవరకు నిజమో! చాలా మంది పాత స్నేహితులంతా ఫోను మిత్రుల నుంచి ఇంటర్నెట్ మిత్రులు గా మారి పోయారు... కొందరు మాత్రం.. అలానే ఉండిపోయారు... చూద్దాం ఎలా ఉంటుందో! నా తరువాత పోస్టు ప్రియ భారత దేశం నుంచి రాస్తా... అంతవరకు సెలవు... :-)

Friday, August 15, 2008

ఆత్మ కధలు

ఈ మధ్య నా జుట్టు ఎలా ఊడుతుందో అంతకంటే ఎక్కువగా "ఆత్మ కధలు" చూస్తున్నా. మన అద్వానీ గారి దగ్గర నుంచి ప్రక్కన ముషరాఫ్ గారి వరకు. వీళ్ళందరికీ డబ్బులు ఉండబట్టి అచ్చేసుకోగాలుగు తున్నారు... నాకూ కొద్దో గొప్పో డబ్బులుంటే నేనూ అలాగే చేద్దును అన్నాడు మా స్నేహితుడు ఒకడు...

"నా జీవితం చదివి పక్కవాళ్ళు బాగుపడతారు" అని "ఆత్మ కధలు" వ్రాసే మహానుభావులని ప్రక్కన పెడితే... నా ఉద్దేశంలో ప్రతి ఒక్కడికీ తనగురించి పక్క వాడు వినాలని ఉంటుంది. కొంత మంది సొంత డబ్బాతో వినిపిస్తారు... కొద్దిగా రాత తెలిస్తే.. ఇలా పుస్తకాలు రాస్తారు. ఇవి రెండూ చెయ్యలేని వాళ్ళు ముసల్లోల్లయ్యాక "మా కాలం ఐతే ... " అనో లేక "నేను నీ వయసులో ఉన్నప్పుడయితే" అనో మనవాళ్ళ దగ్గర చెప్పుకొంటారు.

మొత్తం మీద ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆత్మ కధల్ని ఎలాకోలాగా చెప్పుకొంటూనే ఉంటారనే నిజం నాకు అర్థమయింది...

Sunday, July 20, 2008

సి.పి.బ్రౌను తెలుగు-ఆంగ్లము పదకోశం

మన తెలుగు భాష సేవలో తరించి మనల్ని మనం ఇలా చూసుకోవటానికి అవకాశం కల్పించిన మహానుభావులు ఎందరో! సి.పి.బ్రౌను మహానుభావుడు మనకోసం తెలుగు-ఆంగ్లము పదకోశాన్నిఅందించారు... దాని ఆన్ లైన్ లింకు కోసం ఇక్కడ చూడండి.

Saturday, July 12, 2008

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం: కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలలో కన్నీటి జలపాతాలలో
నాతో నేను అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లుల్నీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం: మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

చరణం: గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హ్రుదయమే నా లోగిలి
నా హ్రుదయమే నా పాటకి తల్లి
నా హ్రుదయమే నాకు ఆలి
నా హ్రుదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం

Sunday, July 6, 2008

మనో మందిరం

అంతర్మనస్కనై, మనో మందిరం లోకి

తొంగి చూసినప్పుడు

ఏకాంతం నేస్తమై నిలచింది.

బహురూపాలు, పలు రూపాలు...

అన్నీ.. నాలో నేనై .. నాకే నేనై..!

ఆగిపోని అలజడి రేపిన వెలుగు వెల్లువలో

కనులు తెరిచినప్పుడు

సమస్త లోకం బిందువై తోచింది.

రూపాలన్నే ఒకటై, భావాలన్నీ ఏకమై...

నేనే నువ్వై, నువ్వే నేనై...!

చిగురంత ఆశ

ఈ లాంగ్ వీకెండ్ లో మా ఫ్రెండ్ కిషోర్ వచ్చాడు మా ఇంటికి... తన పర్సు లో ఒక కవితని పెట్టుకొని తిరుగుతున్నాడు.... ఏమిటంటే... అది తనని తనకి చూపిస్తుందట.. ఆ కవిత ఇదిగో!

కడలి నడుమ పడవ మునిగితే!

కడదాకా ఈదాలి....!!

నీళ్లులేని ఎడారిలో!

కన్నీళ్ళయినా తాగి బతకాలి!!

ఏ లోటు లేనినాడు!

నీ నీడే నీకు తోడు!!

జగమంత దగా చేసినా!

చిగురంత ఆశ చూడు..!!

Saturday, June 28, 2008

మాకూ ఒక భాష కావాలి!

ఆంద్ర జ్యోతి పత్రికలో తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ అనే ఆయిన తన వేదనని కామోసు! కవితా రూపం లో ఇలా చెప్పారు. తను వ్రాసిన ప్రతి అక్షరం నాకు తెగ నచ్చింది. అది మీకోసం. క్లిక్ చెయ్యండి... మాకూ ఒక భాష కావాలి! కోసం!

Monday, June 9, 2008

టక్కులమారి!

రంగులో ఏముంది! గుణం ప్రధానం కానీ అంటారు గానీ! ఈ గుడ్లగూబని చూస్తే అది నిజం కాదనిపిస్తుంది కదా!!

Sunday, June 8, 2008

మౌనం గానే ఎదగమని......

చంద్రబోసు గారి రచన లో... యెం.యెం.కీరవాణి గారు స్వరపరచిన ఈ అద్భుతమయిన నాకు నచ్చిన పాట మీకోసం!!

మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది!
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది!!
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది!
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది!!

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా...
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా!
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా...

బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా!
సాగర మధనం మొదలవగనే విషమే వచ్చింది!
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది!!
అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది

తెలుసుకుంటె సత్యమిది!
తలచుకొంటే సాధ్యమిది!!

చెమట నీరు చిందగా... నుదుటి రాత మార్చుకో!
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో!!
పిడికిలీ బిగించగా... చేతి గీత మార్చుకో!
మారిపోని కధలే లేవని గమనించుకో!!

తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు!
నచ్చినట్టుగ నీ తలరాతను నువ్వే రాయాలి!!
నీ ధైర్యాన్నే దర్శించి దైవాలే తలదించగా!!!
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా!!!

నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి!
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి!!

Wednesday, June 4, 2008

మాతృ భాష - ప్రాధాన్యత

భారత దేశం నుంచి ఒక కాలేజీ ప్రిన్సిపల్ మాతృ భాష - తెలుగు గురించి తన అభిప్రాయాలు వ్రాశారు. వీలుంటే చదవండి. మాతృ భాష - ప్రాధాన్యత

Tuesday, June 3, 2008

భావన

కలసిన మనసుల జత నర్తనలో
అర్థరాత్రి అయినా అరుణోదయమే!
మమతల మల్లెల పందిరి క్రింద
తుఫాను హోరయినా మోహన రాగమే!!

Friday, March 28, 2008

జనార్థన మహర్షి వెన్నముద్దలు:

జనార్థన మహర్షి వెన్నముద్దలు:

మంగళ సూత్రం

మంగళ సూత్రన్ని
మెడకే ఎందుకు కడతారో?
మనసుకి మెదడుకి మధ్య
కబడ్డీ గీతలాగా...


పట్టుకెళ్ళాడు

అంత బరువు డబ్బు
హుండీలో బిడ్డ పుడితే వేస్తానని
తిరుపతి వెంకటేశుడికి
మొక్కుకొన్నాడు.
ఆడపిల్ల పుట్టింది
మొక్కు మరిచాడు
అమ్మాయి పెళ్ళికి
వడ్డీతో సహా
శ్రీనివాసరావు తో
అల్లుడి రూపంలో
పట్టుకెళ్ళాడు.


వివాహానికి పునాదులు:


శివధనస్సు విరిగితేనే
సీతకి రాముడు
మొగుడయ్యాడు
చేప పిల్లని చంపాకే
అర్జునునికి ద్రౌపతి పెళ్ళామయ్యింది
విధ్వంసాలే వివాహానికి
పునాదులు.

you may access the full content from TelugulO.COM

Sunday, March 23, 2008

నా కోసం ఎవరు ఏడుస్తారు??

నిన్న పెరుగు పచ్చడి కోసం ఉల్లిపాయలు (నెల్లూరు ప్రాంతం లో ఎర్రగడ్డలంటారు కూడా) తరుగుతుంటే కళ్ళలో నీరు ధారాపాతం గా కారటం మొదలు పెట్టింది. నేను ఎందుకు ఏడుస్తున్నానొ అని మా రూమ్మేటులు (మా ఆవిడ రెస్టుకోసం ఇండియా కి వెళ్ళింది లేండి) కంగారు పడ్డారు. విషయం తెలిసి నవ్వి ఊరుకొన్నారు.

ఈ ఉల్లిపాయల గురించి 20 సంవత్సరాల క్రితం మా నాన్నమ్మ చెపుతుంటే ఒక కధ విన్నాను. ఆ కధ మీ కోసం.

అనగనగా ఒక ఉల్లిపాయ, ఒక టమోటా మరియు ఒక బంగాళాదుంప (కొన్ని ప్రాంతాలలో ఉర్లగడ్డ అంటారు లేండి) కలసి సముద్ర స్నానానికి వెళ్ళాలనుకొన్నాయి. సరే! బయలుదెరాయి... ఇంతలో ఆ సముద్రం దగ్గర జనాలు ఎక్కువగా ఉండి మన టమోటా గారిని తొక్కేసారు. అయ్యో!! టమోటా!!! నీకప్పుడే నూరేళ్ళూ నిండిపోయాయా?? అని ఉల్లిపాయ, బంగాళాదుంప ఏడవటం మొదలు పెట్టాయి. కొంతసేపటి తరువాత తేరుకొన్నాయి. సముద్ర స్నానాన్ని మొదలు పెట్టాయి. ఇంతలో బంగాళాదుంప కి ఈత రాక మునిగిపోయింది. ఉల్లిపాయ ఏడవటం మొదలు పెట్టింది. అయ్యో!! బంగాళాదుంపా!!! నీకప్పుడే నూరేళ్ళూ నిండిపోయాయా?? అని... ఇంతలో ఉల్లిపాయకి ఒక డౌటు వచ్చింది. టమోటా చనిపోతే నేను, బంగాళాదుంప ఏడ్చాము. బంగాళాదుంప చనిపోతే నేను ఏడ్చాను. మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు? అని. సరే భగవంతుణ్ణి ప్రార్ధించింది. నేను చనిపొతే ఏడ్చెవాళ్ళు కావాలి అని. నీకోసం ఏడ్చెవాళ్ళని సృష్టిస్తే, వాళ్ళు చస్తే ఏడ్చెవాళ్ళని ఎక్కడనుంచి తీసుకురాను అని ఆలోచించి, సరే నిన్ను ఎవరైనా చంపితే వాళ్ళే ఏడుస్తారు అని వరమిచ్చాడట. అప్పటి నుంచి మనం ఉల్లిపాయలు తరిగిన ప్రతిసారీ ఏడుస్తాము. :-)

Saturday, March 22, 2008

హుర్రే!!!

హుర్రే!!!నేను నా నాలుగు సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేసాను. ఇంతకీ నేను ఏమి సాధించానో అని చూస్తే నాకు ఎమీ కనిపిచలేదు...హుర్రే!!! ఏమీ సాధించ కుండా నాలుగు సంవత్సరాలు గడపడం సామాన్యమా చెప్పండి...?? అందుకే ఎవ్వరూ సాధించలేనిది నేను సాధించానని ఎగిరి గంతేస్తూ హుర్రే!!! అని అరిచాను.

ఇంతలోనే నాలాగా నాలుగేళ్ళు పనిపాటాలేకుండా గడిపిన మా స్నేహితుడు ఒకడు నాకు ఫోను చేసాడు... మామా! పార్టీ చేసుకొందాము అని... ఇంకొక సారి హుర్రే!!! అని ఎగిరి గంతేసాను. ఈసారి రెట్టింపు ఆనందం. ఎందుకో తెలుసా..??మొదటికారణం: నాలాగా నాలుగేళ్ళు పనిపాటాలేకుండా ఉన్న ఇంకొకడు దొరికాడని; రెండు: నాలుగేళ్ళు పనిపాటాలేకున్నా పార్టీ వచ్చినందుకు.

నాలుగు చుక్కలు గొంతులో దిగేటప్పటికి ఆత్మశోధన మొదలయ్యింది. ఏమీ సాధించలేదా...!!?? లేదా!!!??? సాధించాను... మా బాసుకి కనిపించకుండా ఆంధ్రజ్యొతి, ఈనాడు చదవటం నాకు తెలిసినట్లు మా ఆఫీసులో ఎవ్వరికీ తెలియదు. ఇంకా... యహూ మెసెంజర్, జిమైలు వాడటం వీటన్నిటిలో మనం మేధావులం కదా! హుర్రే!!! చాలా సాధించాం.

రెండో పెగ్గు:మనం ఎక్చెల్, వర్డు వాడినట్లు ఎవ్వరూ వాడలేదు కదా... అందుకేగా మనం టీం లీడు అయ్యింది... మన పక్కనున్నోళ్ళందరూ పనికిరానొళ్ళని మనమేగా మా మానేజరుకి మందుపోసి మరీ చెప్పింది?? హుర్రే!!! చాలా సాధించాం.

మూడో పెగ్గు:ఆఫ్‌షోరులో ఉన్నప్పుడు ఆన్‌సైటు వాళ్ళని, ఆన్‌సైటు ఉన్నప్పుడు ఆఫ్‌షోరులో వాళ్ళని పనికిరాని వాళ్ళగా చూపించతం మనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలుసు?? మనకి రేటింగు ఇవ్వని మేనేజర్ ని బండబూతులు తిట్టటం, మనకి తెలిసినట్లుగా ఇంకెవరికి తెలుసు? హుర్రే!!! చాలా సాధించాం.

కావాలా ???

Sunday, March 9, 2008

రాజీనామా

ప్రపంచం లో అతి చిన్న రాజీనామా లేఖ:-
సర్!
నేను మీ ఆవిడని ప్రేమిస్తున్నాను.
ఇట్లు

------

Monday, February 25, 2008

భూమి గుండ్రం గా ఉంది

వీడేంటి? "భూమి గుండ్రం గా ఉంది" అని కొత్త నిజం చెప్పినట్లు చెపుతున్నాడు? అనుకొకండి. కొన్ని కొన్ని సంఘటనలు మనకి పైన చెప్పిన నిజాన్ని మరలా మరలా గుర్తు చేస్తుంటాయి.

మొన్న గౌరవ పార్లమెంటు సభ్యుడైన ఉండవెల్లి, మన రాజ్యాంగాన్ని, స్వర్గీయ డా!అంబేత్కర్ గారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినట్లు పేపర్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానిని టిడిపి ప్రొద్బలం తో అంధ్రజ్యోతి, ఈనాడు రాజకీయం చేసాయని కాంగ్రెస్స్ వాళ్ళు ఆరోపించారు.

నిన్న తల్లి తెలంగాణా అద్యక్షురాలు విజయశాంతి టిడిపి మీద చంద్రబాబు మీద వికలాంగుల సంక్షేమం విషయం లో ఆరోపణలు చేసిన సంగతి కూడా తెలిసిందే. దానిని కాంగ్రెస్స్, వైయెస్ ప్రొద్బలం తో విజయశాంతి రాజకీయం చేసిందని టిడిపి వాళ్ళు ఆరోపించారు.

కాంగ్రెస్స్ మీద ఆరోపణలు వస్తే టిడిపి ప్రొద్బలం, టిడిపి మీద ఆరోపణలు వస్తే కాంగ్రెస్స్ ప్రొద్బలం. ఇదేదో "భూమి గుండ్రం గా ఉంది" ని గుర్తుకు తెస్తుంది కదా!!

Tuesday, February 12, 2008

మన తెలుగు బ్లాగుల గురించి ఈనాడు లో

మన తెలుగు బ్లాగుల గురించి ఈనాడు లో వచ్చిన వ్యాసం చూశారా...? చూడాలంటే ఈ లింక్ క్లిక్ చెయ్యండి। http://www.eenadu.net/archives/archive-3-2-2008/htm/weekpanel1.asp లేదా ఈ ఇమేజి చూడండి।

Sunday, February 10, 2008

కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్

ఈ పద్యం విన్నారా...? ఎప్పుడైనా..??

"గంజాయి తాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా
లంజల కొడకా ! యెక్కడ
కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్ | కం | "

పోనీ ఈ పద్యం...????

"రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా
సంజయా ! యేమని చెప్పుదు ?
కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్ | కం |"

ఇవి తెనాలి రామకృష్ణ కవి కధలలో చెప్పెవారు నా చిన్నప్పుడు.

ఒకసారి రామకృష్ణ కవి గారిని ఏవిధంగానూ ఎదుర్కోలేక , చివరికి కాపలా వాళ్ళ చేత అవమానింప చెయ్యాలని అనుకొన్నారు మిగతా కవులు. మిగతాకవులిచ్చే లంచాలకి ఆశపడి కాపలా వాళ్ళు కవులిచ్హే సమస్యని రామకృష్ణ కవి గారి ముందు ఉంచటానికి సిద్దపడ్డారు. సమస్య ఎమిటంటే "కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్".(అంటే ఏనుగుల గుంపు వెళ్ళి దొమ గొంతులో ఇరుక్కొన్నదని అర్థం). దీనిని కవి గారి ముందు సమస్యా పూరణం కోసం ఉంచారు భటులు. రామకృష్ణ కవి గారికి విషయం అర్థమయ్యింది. అందుకని మొదటి పద్యాన్ని వదిలారు....

దాని అర్థం భటులకి బోధపడెలోగా కవిగారు భువనవిజయం వైపు అడుగులు వేసారు. రాయల వారికి ఈ విషయం తెలిసింది. సరే రామకృష్ణులవారి చతురత ఏమిటో చూద్దామని మరల అదే సమస్యనిచ్చారు రాయలవారు. ఈ సారి అడిగింది రాయలవారు, మరలా అదే సమాధానం చెపితే దండన తప్పదని మురిసిపొతున్నారు మిగతా కవులు. కాని రామకృష్ణులవారి చతురత తెలిసిందె కదా! సభలొ ఈ రెండో పద్యం వదిలారు. ఎవ్వరికీ నోటమాట రాలెదు. రాయలవారు స్వయంగా కవిగారిని ఆలింగనం చేసుకొని, రామకృష్ణా "నీ కత్తికి రెండువైపులా పదునే" అని ప్రసంసించారట.

మొదటి పద్య భావం అర్థమయి ఉంటుంది. రెండవపద్య భావం: " (మహాభారతం లోని పాండవులని ఏనుగులతో పొల్చారు). మహా బలవంతులు అయిన పాండవులు, కౌరవుల జూదం లో ఒడిపొయి, ఒక చిన్న సామంత రాజయిన విరాట రాజు (విరాట రాజుని దొమతో పోల్చారు) కొలువు లో అజ్ఞాతవాస సమయం లో పనిచెయ్యవలసి వచ్హింది. ఓ రాజా ఇది ఏనుగుల గుంపు వెళ్ళి దోమ గొంతులో కూర్చొవటం కాక మరేమిటి? "/

Saturday, February 9, 2008

నువ్వు నువ్వు నువ్వే

నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నాలోనే నువ్వు
నాతోనే నువ్వు
నాచుట్టూ నువ్వు
నేనంతా నువ్వు
నా పెదవి పైనా నువ్వు
నా మెడ వంపున నువ్వు
నా గుండె మీదా నువ్వు
వొళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వు, మొగ్గల్లే నువ్వు, ముద్దేసే నువ్వు...
నిద్దర్లో నువ్వు, పొద్దుల్లో నువ్వు, ప్రతి నిమిషం నువ్వూ...
నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు

ఎంటి వీడికేమీ పిచ్చి పట్టలేదుకదా అనుకొకండి. ఎమీ లేదండీ... నిన్న ఎదో ఊసుబోని కబుర్లలో... ఈ పాట ప్రస్థావనకు వచ్చింది. మన సిరివెన్నెల ఎంత బాగా రాసాడొ కదా! అనుకొన్నాం. నేను రచించక పోయినా.. ఒక్క సారి తెలుగులొ వ్రాస్తే ఎలా ఉంటుందొ అని ప్రయత్నించాను. అదీ సంగతి.

Friday, February 8, 2008

చర్చిల్ - ఫూల్సు

ఒక సారి చర్చిల్ బ్రిటన్ పార్లమెంటులో ఆవేశంగా ప్రసంగిస్తూ "నిజం చెప్పలంటే ఈ పార్లమెంటులో సగం మంది ఫూల్సే..." అన్నాడట.. ఇంకేముంది! పెద్దగొడవ మొదలయింది. సభ దద్దరిల్లింది. చర్చిల్ తన మాటలు ఉపసం హరించుకొవాలని,సభకు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. అలాగేనంటూ చర్చిల్ లేచి, "అయ్ యాం వెరీ సారీ! నిజంగా ఈ పార్లమెంటులో సగం మంది ఫూల్సు కాదు." అన్నాడట.