నిన్న పెరుగు పచ్చడి కోసం ఉల్లిపాయలు (నెల్లూరు ప్రాంతం లో ఎర్రగడ్డలంటారు కూడా) తరుగుతుంటే కళ్ళలో నీరు ధారాపాతం గా కారటం మొదలు పెట్టింది. నేను ఎందుకు ఏడుస్తున్నానొ అని మా రూమ్మేటులు (మా ఆవిడ రెస్టుకోసం ఇండియా కి వెళ్ళింది లేండి) కంగారు పడ్డారు. విషయం తెలిసి నవ్వి ఊరుకొన్నారు.
ఈ ఉల్లిపాయల గురించి 20 సంవత్సరాల క్రితం మా నాన్నమ్మ చెపుతుంటే ఒక కధ విన్నాను. ఆ కధ మీ కోసం.
అనగనగా ఒక ఉల్లిపాయ, ఒక టమోటా మరియు ఒక బంగాళాదుంప (కొన్ని ప్రాంతాలలో ఉర్లగడ్డ అంటారు లేండి) కలసి సముద్ర స్నానానికి వెళ్ళాలనుకొన్నాయి. సరే! బయలుదెరాయి... ఇంతలో ఆ సముద్రం దగ్గర జనాలు ఎక్కువగా ఉండి మన టమోటా గారిని తొక్కేసారు. అయ్యో!! టమోటా!!! నీకప్పుడే నూరేళ్ళూ నిండిపోయాయా?? అని ఉల్లిపాయ, బంగాళాదుంప ఏడవటం మొదలు పెట్టాయి. కొంతసేపటి తరువాత తేరుకొన్నాయి. సముద్ర స్నానాన్ని మొదలు పెట్టాయి. ఇంతలో బంగాళాదుంప కి ఈత రాక మునిగిపోయింది. ఉల్లిపాయ ఏడవటం మొదలు పెట్టింది. అయ్యో!! బంగాళాదుంపా!!! నీకప్పుడే నూరేళ్ళూ నిండిపోయాయా?? అని... ఇంతలో ఉల్లిపాయకి ఒక డౌటు వచ్చింది. టమోటా చనిపోతే నేను, బంగాళాదుంప ఏడ్చాము. బంగాళాదుంప చనిపోతే నేను ఏడ్చాను. మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు? అని. సరే భగవంతుణ్ణి ప్రార్ధించింది. నేను చనిపొతే ఏడ్చెవాళ్ళు కావాలి అని. నీకోసం ఏడ్చెవాళ్ళని సృష్టిస్తే, వాళ్ళు చస్తే ఏడ్చెవాళ్ళని ఎక్కడనుంచి తీసుకురాను అని ఆలోచించి, సరే నిన్ను ఎవరైనా చంపితే వాళ్ళే ఏడుస్తారు అని వరమిచ్చాడట. అప్పటి నుంచి మనం ఉల్లిపాయలు తరిగిన ప్రతిసారీ ఏడుస్తాము. :-)
12 comments:
హ హ...బాగుంది కధ.కానీ డౌటు ఉల్లిపాయకి కదా రావాలి?బంగాళా దుంపకి వచ్చిందేమిటి?ఆ వర్డ్ వెరిఫికేషను తీసేయరూ మీకు పుణ్యం వుంటుంది.
కథ బాగుంది, మీకూ మీ నాన్నమ్మ గారికి నెనర్లు (థాంకులు). అన్యాయం ఏమిటంటే కొన్ని సార్లు మేం ఆలుగడ్డ (బంగాళాదుంప, ఉర్లగడ్డ) కూర వండేటప్పుడు ముందుగా ఉల్లిగడ్డలను (ఉల్లిపాయలను) కోసి ఆ తరువాత మిగతా వాటిని కోసి కూర వండిన తరువాత తింటూ ఏడుస్తాము.
రాధిక గారూ... తప్పును చూపించినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు సరిచేసాను చూడండి. మొత్తం టైపు చేయటం ఎందుకని, కాపీ పేస్టు చేస్తుంటే ఇలా అయ్యింది. ఇంతకీ "ఆ వర్డ్ వెరిఫికేషను తీసేయరూ" అన్నారు. వర్డ్ వెరిఫికేషను ఏమిటి?
నాగరాజు గారూ... కధ నచ్చినందుకు సంతోషం. ఇంతకీ తింటూ ఏదవటం ఎందుకు? పొరపాటున మీరు వంట చేస్తారా ఏమిటి? :-)
బాగుందండీ మీ ఎర్రగడ్డ కథ!
బావుందండీ మీరు చెప్పిన (నాయినమ్మగారి) కథ.
భలే ఉంది మీ ఉల్లిపాయ కథ ... :)
భలే ఉంది మీ ఉల్లిపాయ కథ ... :)
:))
కథ చాలా బాగుంది. ఇలాంటి కథలింకా గుర్తొస్తే చెప్తూవుండండి.
"వర్డ్ వెరిఫికేషన్" - మీరు గూగుల్లోకి (జీమెయిల్, బ్లాగర్, ఆర్కుట్ ఇలాంటి వాటిలోకి) లాగిన్ కాకుండా, మీ బ్లాగులో వ్యాఖ్య రాయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు వ్యాఖ్య రాస్తున్న డబ్బా కింద వుంటుంది చూడండి Word Verification TextBox.
రాధిక గారూ "వర్డ్ వెరిఫికేషన్" తీసేసాను.
అలాగేనండి రానారె గారూ... మీ సలహాలకి కృతజ్నతలు
శ్రీ గారూ, రాఘవ గారూ, శ్రీవిద్య గారూ మీ కామెంట్లకి కృతజ్ఞతలు.
Post a Comment